: ‘మానవ బాంబు’గా సారిక?...గదిలో రెండో సిలిండరే కారణమంటున్న పోలీసులు!


ముగ్గురు చిన్నారి కొడుకులతో కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ‘మానవ బాంబు’లా పేలేందుకు యత్నించిందా? అంటే, అవుననే అంటున్నారు వరంగల్ పోలీసులు. మూడంతస్తుల భవనంలో రెండో అంతస్తులో పిల్లలతో కలిసి పడుకున్న సారిక, తెల్లవారుజామున గ్యాస్ ను లీక్ చేసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన జరిగిన సమయంలో సారిక గదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటిలో ఓ సిలిండర్ నుంచి గ్యాస్ ను లీక్ చేసిన సారిక, గదిలో మంటలు చెలరేగేలా చేసింది. నిండుగా ఉన్న రెండో సిలిండర్ ను గది మధ్యలో ఉంచింది. మంటల ధాటికి రెండో సిలిండర్ పేలిపోతుందని, దీంతో వెనువెంటనే భవనం కూడా కుప్పకూలుతుందని సారిక భావించింది. దీంతో సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య, కొడుకు (సారిక భర్త) అనిల్ కూడా ఈ ఘటనలో చనిపోతారని ఆమె భావించిందట. సారిక గదిలో లభ్యమైన రెండో సిలిండర్ ఇందుకోసమేనని పోలీసులు చెబుతున్నారు. తనను, తన పిల్లలను పట్టించుకోకపోవడమే కాక కనీసం సరిపడ తిండి కూడా లేకుండా నానా చిత్రహింసలకు గురి చేసిన సిరిసిల్ల రాజయ్య కుటుంబాన్ని మట్టుబెట్టాలనే సారిక భావించిందని, ఈ క్రమంలోనే ఆమె వంట గదిలోని రెండు సిలిండర్లను తన గదిలోకి తీసుకెళ్లిందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన పోలీసులు, దీనిని మాత్రం పూర్తిగా నిర్ధారించడం లేదు. అయితే ఘటనపై పోలీసులు ఈ దిశగానే దర్యాప్తును ముందుకు సాగిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News