: అది ఆత్మహత్యే...కానీ ఒత్తిడి ఉంది... దర్యాప్తులో పోలీసులు తేల్చింది ఇది...!


మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లది ఆత్మహత్యగా తేల్చిచెప్పిన పోలీసులు, వారిపై అత్తింటి ఆరళ్లు ఉన్నాయని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యంత వేగంగా రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో వివరాలు ఇవే... ప్రేమ వివాహం చేసుకున్న సారిక కాపురం కొంతకాలంగా పాటు సాఫీగానే సాగింది. ఎప్పుడైతే అనిల్ కు రెండో వివాహం చేశారో అప్పటి నుంచి సారికపై వేధింపులు మొదలయ్యాయి. అనిల్ తల్లిదండ్రుల మద్దతుతో సారికపై వేధింపులకు పాల్పడ్డాడు. సారికను, మామ రాజయ్య, అత్త మాధవీలత వేధించారు. దీంతో ఆమె న్యాయం కోసం పలు సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ వేధించడం ప్రారంభించారు. పలు సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా సూచించారు. ఆ ఇంట్లో సారిక, ఆమె పిల్లలు మాత్రమే పరాయివారిగా మిగిలిపోయారు. ఉపఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు మరింత ఎక్కువవుతాయని సారిక భయపడింది. పలుకుబడి ఉపయోగించి వేధిస్తారని సారిక భయపడింది. దీంతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పేర్కొన్నారు. తెల్లవారు జామున నాలుగు నుంచి నాలుగున్నర గంటల మధ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆ ఇంట్లోంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు 100, 108కు ఫోన్ చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇంటి బెడ్ రూంలో రెండు గ్యాస్ సిలెండర్లు ఉన్నాయని, అందులో ఒకటి ఖాళీదని, రెండోది ఫుల్ అని పోలీసులు వెల్లడించారు. మంటలు, పొగ కారణంగానే సారిక, పిల్లలు మరణించారని నివేదికలో స్పష్టం చేశారు. దీనిపై బెయిల్ కు అప్లై చేసిన రాజయ్య, మాధవీలత న్యాయస్థానం ముందు తమ వాదన వినిపించారు. తాము ఎలక్షన్ ప్రచారం కోసం ఆ ఇంటికి రెండు రోజుల ముందు వచ్చామని, ఈ ఆత్మహత్యతో తమకు సంబంధం లేదని అన్నారు. దీంతో వారి బెయిల్ పిటీషన్ పై విచారణ ఈ నెల 12కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News