: ఇకపై ఆడియో వేడుకల్లో మాట్లాడను: సినీ నటుడు అలీ సంచలన నిర్ణయం
ఇకపై తాను ఆడియో వేడుకల్లో మాట్లాడనని సినీ నటుడు అలీ తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, సినిమా హీరోయిన్లపై కామెంట్ చేయడమే తన పని కాదని అన్నాడు. తాను మాట్లాడడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరాడు. తానేమీ ప్రత్యేకంగా వారిని ఇబ్బంది పెట్టాలని మాట్లాడనని అలీ పేర్కొన్నాడు. అలా అయితే వారు కూడా తనకు చెబుతారని అలీ చెప్పాడు. ఇలాంటి తలనొప్పి లేకుండా ఆడియో వేడుకలకు హాజరైనా మాట్లాడకూడదని భావిస్తున్నానని పేర్కొన్నాడు. తన పిల్లలు స్కూలుకు వెళ్లినప్పుడు కొంత మంది 'అదేంటి మీ నాన్న అలా మాట్లాడారు?' అని అడుగుతున్నారని, తనను అడగాల్సిన ప్రశ్నలకు తన పిల్లలు ఎలా సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించాడు. తానేమీ అక్కడ అనవసర సంభాషణను లేవనెత్తడం లేదని, అక్కడ జరిగే సన్నివేశానికి హాస్యం జోడిస్తున్నానని అలీ చెప్పాడు. తానేం మాట్లాడినా ఇబ్బంది పెడుతున్నానంటే ఎలా? అని ఆయన ప్రశ్నించాడు. ఈ వివాదాలేవీ లేకుండా ఇకపై ఆడియో వేడుకల్లో మాట్లాడనని అలీ స్పష్టం చేశాడు.