: రైతును పట్టుకుని సైకో అనడం సిగ్గుచేటు: ఎర్రబెల్లి నిప్పులు
పడ్డ కష్టానికి గిట్టుబాటు ధర రాక, తన ఆక్రోశాన్ని బయట పెట్టిన ఓ రైతును సైకోగా అభివర్ణించడం టీఆర్ఎస్ నేతలకు సిగ్గుచేటని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్ సర్కారు రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఓ రైతును సైకో అనడం ఆయన స్థాయికి సరికాదని హితవు పలికిన ఎర్రబెల్లి, రైతుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఎర్రబెల్లి ఆరోపించారు.