: ఇండియా వద్దనుకుంటే అంతే... ఇంధనం లేక నేపాల్ లో రేపటి నుంచి ఆగనున్న విమానాలు!


నేపాల్ లో మారిన రాజ్యాంగాన్ని, భారత్ కు దూరమవుతూ, చైనాకు దగ్గరయ్యేందుకు ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ, మైనారిటీ వర్గానికి చెందిన మధేసీలు చేపట్టిన ధర్నా ఆరో వారానికి చేరగా, నేపాల్ లోని ఇంధన నిల్వలు పూర్తిగా అడుగంటాయి. రేపటి లోగా విమాన ఇంధనం అందకుంటే, ప్రభుత్వ రంగ నేపాల్ ఎయిర్ లైన్స్ సహా మరో ఆరు విమానయాన సంస్థల విమానాలు గాల్లోకి ఎగిరే పరిస్థితి లేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి ముకుందా గిమిరే వ్యాఖ్యానించారు. ఇండియా నుంచి నేపాల్ కు వస్తున్న వందలాది లారీలను సరిహద్దు చెక్ పాయింట్ వద్ద నిరసనకారులు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. కోల్ కతా నుంచి విమానమార్గం ద్వారా ఇంధనం తెప్పించుకునే యోచనలో ఉన్నామని, అది కూడా అతి తక్కువ సర్వీసులు నడిపేందుకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. కాగా, నిరసనకారులు, పోలీసులతో పలుమార్లు ఘర్షణ పడగా, 40 మంది ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో మధేసీలు అధికంగా ఉన్న ప్రాంతాలకు బలగాలను సైతం తరలించలేని పరిస్థితి నెలకొందని సమాచారం.

  • Loading...

More Telugu News