: ఏపీకి 14, తెలంగాణకు 6.2 టీఎంసీలు... కృష్ణా నీటి విడుదలకు బోర్డు ఆదేశాలు
ఆంధ్రప్రదేదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కృష్ణా నీటిని కేటాయించింది. ఈ మేరకు ఏపీకి 14 టీఎంసీలు, తెలంగాణకు 6.2 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దిగువ రాష్ట్రాల అవసరాలకు నీరందేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది. గత నెల 28న తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖల అధికారులతో జరిపిన సమావేశంలో నీటి అవసరాలను వివరించారని చెప్పింది. నల్లగొండలో తాగునీటి అవసరాలకు అదనంగా 2.5 టీఎంసీలు కావాలని 29న తెలంగాణ కోరిందని, రెండు రాష్ట్రాల నీటి అవసరాలను గుర్తించి నీటిని విడుదల చేస్తున్నామని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేసింది. అంతేగాక ఈ నీటి విడుదల ద్వారా ఉత్పత్తయ్యే జల విద్యుత్తును రెండు రాష్ట్రాలు పంచుకోవాలని బోర్డు సూచించింది.