: కుదురుకున్నాడనుకున్న కోహ్లీ అవుట్!
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ నిదానంగా సాగుతూ, ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 125/2తో నేటి ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్ పుజారా, కెప్టెన్ కోహ్లీల జోడి నిదానంగా ఆడుతూ, స్కోరును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ, ఏ దశలోనూ దక్షిణాఫ్రికా బౌలర్ల ఎత్తులకు చిక్కలేదు. ఈ క్రమంలో పుజారా అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న కోహ్లీ 29 పరుగుల వద్ద వాన్ జీల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు 55.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు కాగా, ఇండియా 179 పరుగుల లీడ్ లో ఉంది. మరో 150 పరుగులు చేస్తే భారత్ పటిష్ఠ స్థితిలో ఉన్నట్టేనని క్రీడా పండితులు భావిస్తున్నారు.