: రాష్ట్ర ఐటీ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు 48 అమెరికా సంస్థలు ఆసక్తి చూపాయి: ఏపీ మంత్రి పల్లె
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పర్యటన వివరాలను తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీలో సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ ఏర్పాటుకు మిట్ తో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇక తిరుపతిలో ఇన్ క్యుబేషన్ సంస్థ ఏర్పాటుకు టెక్సాస్ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు 48 అమెరికా సంస్థలు ఆసక్తి చూపాయని పేర్కొన్నారు. అమరావతి కోసం 17.91 లక్షల ఈ-బ్రిక్స్ కొనుగోలుకు ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపారని మంత్రి వివరించారు. ఇదిలాఉంటే రాయలసీమ అభివృద్ధి పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారని, సీమలో పలు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఐదారు నెలల్లో మంచి ఫలితాలు వస్తాయన్న పల్లె, సీమ అభివృద్ధి కోసం ఎవరూ ఆందోళన చేయాల్సి అవసరం లేదని సూచించారు.