: రెండో రోజు విజేత టీమిండియా...రాణించిన పుజారా, విజయ్
రెండో రోజు ఆటలో విజేతగా టీమిండియా నిలిచింది. తొలి రోజు టీమిండియాను ఆలౌట్ చేసి సమర్థవంతంగా అడ్డుకున్న సఫారీల ఇన్నింగ్స్ రెండో రోజు టీ విరామ సమయానికి ముగిసింది. 28 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టును టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ బాటపట్టించాడు. టాపార్డర్ ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత జడేజా, మిశ్రాల బంతులకు సౌతాఫ్రికా జట్టు రెండో రోజు ఆటలో టీ విరామానికి ముందే 184 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బ్యాట్స్ మన్ లో డివిలియర్స్ (63) రాణించాడు. దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, ఆదిలోనే ధావన్ (0) వికెట్టును కోల్పోయింది. దీంతో మురళీ విజయ్ (47), ఛటేశ్వర్ పుజారా (63) మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా పదే పదే బౌలర్లను మార్చడం విశేషం. ఒక ఎండ్ లో బౌలర్లను మార్చిన ఆమ్లా, రెండో ఎండ్ లో కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించాడు. ఈ క్రమంలో స్టెయిన్ కు సబ్ స్టిట్యూట్ గా వచ్చిన బవుమా అద్భుతమైన క్యాచ్ కు విజయ్ పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కోహ్లీ (11) అండగా పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోష్ తోనే ఈ టెస్టులో ఇప్పటి వరకు నమోదు కాని సిక్సర్ ను బాదాడు. రెండో రోజు 40 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో 142 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. భారత జట్టు మరో 200 పరుగులు చేయగలిగితే తొలి టెస్టులో విజయం సాధించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.