: ఒకవేళ బీహార్లో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు?


బీహార్ లో మహాకూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అన్ని వేళలా నిజం కావని, బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రారంభంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా సుశీల్ కుమార్ మోదీని బీజేపీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన అనంతరం లెక్కలు తారుమారయ్యాయి. దీంతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేదానిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో నలుగురి పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. రాజేంద్ర సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తరువాత ప్రేమ్ కుమార్ పేరు వినపడుతోంది. నందకిషోర్ యాదవ్, రామేశ్వర్ ప్రసాద్ చౌరాసియా పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీరిలో రాజేంద్ర సింగ్ ఆర్ఎస్ఎస్ లో పూర్తి కాల ప్రచారక్ గా ఉన్నారు. గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయనలాగే రాజేంద్ర సింగ్ కూడా ముఖ్యమంత్రి అవుతారని పేర్కొంటూ ఆయనను 'బీహార్ కీ మనోహర్ లాల్ ఖట్టర్' అంటూ అప్పుడే పిలుస్తున్నారు. అయితే రాజేంద్ర సింగ్ బీహార్ లో ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ తోనే ఆయనకి అనుబంధం ఎక్కువ. అలాగే జార్ఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన 2013లో ఎన్నికయ్యారు. దీంతో ఆయనకు బీహార్ కంటే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తోనే అనుబంధం ఎక్కువ. అదీ కాక రాజేంద్రసింగ్ పై దినారా నియోజకవర్గంలో నితీష్ మంత్రివర్గ సభ్యుడు జయకుమార్ సింగ్ పోటీ చేశారు. ఆయనపై రాజేంద్రసింగ్ గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కడం అనుమానంగానే మారింది. ఆయన తరువాతి స్థానంలో ప్రేమ్ కుమార్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. 1990 నుంచి ఇప్పటి వరకు ప్రేమ్ కుమార్ కు పరాజయమన్నదే లేదు. ఎన్నికలకు రెండు రోజుల ముందు 'బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్' అంటూ బీజేపీ అధికార ప్రతినిథి షానవాజ్ హుస్సేన్ గయలో పేర్కొన్నారు. అయితే ప్రేమ్ కుమార్ పై బలమైన కాంగ్రెస్ అభ్యర్థి ప్రియరంజన్ పోటీ చేయడంతో ఆయన గెలుపు కూడా డైలమాలో పడింది. బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత నందకిషోర్ యాదవ్ కూడా ప్రమ్ కుమార్ లా ఓటమి ఎరుగని ధీరుడే. ముఖ్యమంత్రి రేసులో ఆయన కూడా ఉన్నారు. ఆయనుకున్న అదనపు అర్హత మోదీతో సాన్నిహిత్యం. రామేశ్వర ప్రసాద్ చౌరాసియాకు కూడా మోదీతో సాన్నిహిత్యం ఉంది. ఆయకు కూడా గెలుపు అవకాశాలున్నాయి. పార్టీకి సుదీర్ఘంగా సేవలందిస్తున్నారు. దీంతో బీహార్ లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేదానిపై పూర్తి స్పష్టత రాకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News