: రష్యా విమానంలో బాంబు... అందుకే అది పేలిపోయింది!: బ్రిటన్ చెప్పిన సంచలనం!
గత వారం సినాయ్ పెనిన్సులాలో కుప్పకూలి 224 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న విమానం ప్రమాదం ఘటనలో బ్రిటన్ విచారణ బృందం ప్రపంచమే ఆశ్చర్యపోయే నిజాన్ని వెల్లడించింది. ఆ విమానం కార్గోలో బాంబులను అమర్చారని, అందువల్లే అది ఆకాశంలో పేలిపోయిందని తాము భావిస్తున్నామని తెలిపారు. లగేజీ లోపల లేదా, బయట ఈ బాంబును అమర్చి ఉండవచ్చని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. కాగా, గత శనివారం నాడు ఎయిర్ బస్ ఏ 321, 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో కలసి ప్రయాణిస్తూ, ఈజిప్టులో కూలిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని తామే పేల్చామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇదిలావుండగా, విమానంలో బాంబులను అమర్చారని భావించడం తొందరపాటు చర్యని రష్యా, ఈజిప్ట్ ప్రభుత్వాధికారులు వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని అంశాలనూ దర్యాఫ్తు చేస్తున్నందున సాధ్యమైనంత త్వరగా నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపారు. ఒకవేళ బ్రిటన్ చెప్పేదే నిజమైతే, ప్రపంచ విమానరంగ నిబంధనలను సమూలంగా మార్చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు.