: రాజేంద్ర సదాశివ నిఖల్జే...ఛోటా రాజన్ అయ్యేందుకు వేసిన తొలి అడుగు ఇదే!
రాజేంద్ర సదాశివ నిఖల్జే (చోటా రాజన్)... మాఫియాను గడగడలాడించిన దావుద్ ఇబ్రహీంకు కూడా ముచ్చెమటలు పట్టించిన వ్యక్తి. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లమ్ముకునే రాజేంద్ర సదాశివ నిఖల్జే, ఛోటా రాజన్ గా ఎలా మారాడు? దావూద్ ను ఎలా భయపెట్టగలిగాడు? ఈ సంగతులు తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాలి. దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేసిన క్రమంలో ప్రజా జీవనం నెమ్మదిగా కుదుట పడుతున్న 1979వ సంవత్సరంలో ఓ రోజు సినిమా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ముంబైలో అప్పటికే బ్లాక్ టికెట్ల దందా జోరుగా నడుస్తోంది. బ్లాక్ టికెట్లు అమ్మేవారిపై పోలీసులు విరుచుకుపడి పోలీస్ స్టేషన్లకు తరలించే వారు. ఆ రోజు అక్కడి చెంబూర్ ప్రాంతంలోని సహకార్ థియేటర్ వద్ద ఓ సినిమా టికెట్ల కోసం తోపులాట చోటుచేసుకుంది. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారిని టార్గెట్ చేసిన పోలీసులు వారిపై ప్రతాపం చూపుతున్నారు. ఆ థియేటర్ ను జీవనోపాధిగా చేసుకున్న రాజేంద్ర సదాశివ నిఖల్జే ఓ పోలీసు చేతిలోని లాఠీని గుంజుకుని, వారిపై విరుచుకుపడ్డాడు. ఐదుగురు పోలీసులపై ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో ఈ విషయం బ్లాక్ మార్కెట్ దందా సాగించే నేరగాళ్ల ముఠా నాయకులకు చేరింది. అప్పటికి టైపు రైటర్లు దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడి మాఫియా డాన్ 'బడా' రాజన్ గా ఎదిగిన రాజన్ నాయర్ తన గ్యాంగును పెంచుకునే పనిలో పడ్డాడు. బడా రాజన్ కు ఎంతో నమ్మకస్తుడిగా మసలిన కుంజు అహ్మద్ వేరు కుంపటి పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా బడా రాజన్ ఎంతగానో ప్రేమించిన యువతిని ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో బడా రాజన్, కుంజు అహ్మద్ పై పగపట్టాడు. కుంజు అహ్మద్ ను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో రాజేంద్ర సదాశివ నిఖల్జే విషయం బడా రాజన్ చెవికి సోకింది. దీంతో తమ గ్యాంగ్ లో చేరాల్సిందిగా రాజేంద్రకు కబురు పంపాడు. దీంతో రాజన్ గ్యాంగ్ లో చేరి, తక్కువ కాలంలోనే బడా రాజన్ కు బాగా చేరికయ్యాడు. గ్యాంగులో తన ప్రాబల్యం పెంచుకుని ఛోటా రాజన్ గా మారాడు రాజేంద్ర సదాశివ నిఖల్జే. ఇంతలో బడా రాజన్ ను కుంజు అహ్మద్ హత్య చేశాడు. వెంటనే ఛోటా రాజన్ ముంబై బంద్ కు పిలుపునిచ్చాడు. అప్పటికి బంద్ ల సంస్కృతి విస్తరించలేదు. ముంబై బంద్ విజయవంతం కావడంతో మాఫియా వర్గాల్లో చోటా రాజన్ పేరు మార్మోగిపోయింది. బడా రాజన్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఛోటా రాజన్, కుంజు అహ్మద్ ను హత్య చేసేందుకు వేసిన ప్లాన్లు, చేసిన హత్యలు 80వ దశకంలో ముంబైని హడలెత్తించాయి. దీంతో, దావూద్ ఇబ్రహీం అడ్డా ముసాఫిర్ ఖానా నుంచి ఛోటా రాజన్ కు పిలుపు వచ్చింది. మరో ఆలోచన లేకుండా దావూద్ గ్యాంగ్ లో చేరిపోయాడు. తరువాత దావూద్ అండతో తన గురువును హత్య చేసిన కుంజు అహ్మద్ ను అతని ప్రాంతంలోనే హత్య చేసి తన ప్రాభవం చాటుకున్నాడు. ఆ తరువాత దావూద్ గ్యాంగులో కీలకంగా మారాడు. ముంబై పేలుళ్ల అనంతరం దావూద్ తో విభేదించి, వేరు కుంపటి పెట్టుకున్నాడు. అప్పటి నుంచి దావూద్ కు కంట్లో నలుసుగా మారాడు. దావూద్ ఆనుపానులన్నీ తెలిసిన ఛోటా రాజన్, దావూద్ అనుచరుల్ని మట్టుబెట్టి పనులు చక్కబెట్టుకునే వాడు. ఈ క్రమంలో పోలీసుల దాడులు, దావూద్ గ్యాంగ్ లక్ష్యం ఛోటా రాజన్ గా మారడంతో అతని గ్యాంగ్ పై దాడులు పెరిగిపోయాయి. నలువైపులా ఇబ్బందులు పెరగడంతో ఇక్కడే ఉంటే ప్రమాదమని భావించి దేశం వీడాడు. అయినా మాఫియాను వీడలేదు. విదేశాల్లో ఉంటూ ఉనికిని చాటుకున్నాడు. 27 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత ఇప్పుడు భారత్ లోకి బందీగా అడుగుపెట్టాడు. మరిప్పుడు, రాజన్ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో!