: ఈ సాయంత్రం రాజన్ ను ప్రశ్నించనున్న రా, ఐబీ... కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డాన్
అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య మాఫియా డాన్ ఛోటా రాజన్ ను బాలి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే అతడిని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఎయిమ్స్ వైద్యులతో పరీక్షలు చేయించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ, కిడ్నీ సంబంధిత వ్యాధితో రాజన్ బాధపడుతున్నట్టు తెలిపారు. మరోవైపు, రాజన్ నుంచి సమాచారం రాబట్టేందుకు కీలక శాఖల అధికారులు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం 4 గంటలకు రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు రాజన్ ను ప్రశ్నించనున్నారు. మరోవైపు, రాజన్ కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, సీబీఐ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.