: గ్రేటర్ మంత్రులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ... సీఎస్ కు టీడీపీ, బీజేపీ ఫిర్యాదు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. ఈ మేరకు సచివాలయంలో ఆయనకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రొటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్, స్పీకర్ లకు ఫిర్యాదు చేస్తామన్నారు. హైదరాబాద్ ఇన్ ఛార్జ్ గా మంత్రి నాయినిని ప్రభుత్వం నియమించిందనీ, అయితే తానే ఇన్ చార్జ్ నంటూ తలసాని నగరంలో పర్యటిస్తూ, అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను టీఆర్ఎస్ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. మాగంటితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు సాయన్న, ప్రకాశ్ గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు సీఎస్ ను కలసిన వారిలో ఉన్నారు.