: సోమవారం 'బ్లాక్ మండే' తప్పదా?
బీహారులో ఎన్నికలు ముగిసి, అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైన వేళ, వివిధ చానళ్లు, రీసెర్చ్ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనను పెంచాయి. బీహారులో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాకుంటే, కీలక సంస్కరణలు మరింత నిదానించి వృద్ధి విఘాతాలు ఏర్పడతాయని ఇప్పటికే నిపుణులు వ్యాఖ్యానించడం, బీహారులో నితీష్ మరోసారి పీఠాన్ని అధిరోహించవచ్చని వస్తున్న ఊహాగానాలతో స్టాక్ మార్కెట్లో షార్ట్ పొజిషన్లు పెరిగి భారీ నష్టం రావచ్చని అంచనా. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకునేందుకే మొగ్గు చూపుతారని కూడా మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆదివారం నాడు బీహార్ ఫలితాలు వెలువడనుండగా, బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమైతే, సోమవారం నాడు ఇండియన్ స్టాక్ మార్కెట్ కు 'బ్లాక్ మండే' తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు. మోదీకి జనామోదం ఎంతగా ఉందన్నదానికి, ఆయన పనితీరుకు బీహార్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలో ఇన్వెస్ట్ మెంట్ ఆలోచనల్లో ఉన్న విదేశీయులు సైతం, బీహార్ ఎన్నికల ఫలితాలపై కన్నేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎంత బలముందన్న విషయంతో పాటు, ప్రజల్లో ఉన్న ఆదరణకు రాష్ట్రాల ఎన్నికలే నిదర్శనం కాబట్టి. మోదీ సర్కారు గద్దెనెక్కి ఏడాదిన్నర పూర్తి కావడం, సంస్కరణల అమలు వేగవంతం చేస్తామని పలు దేశాల్లో మోదీ ఇచ్చిన హామీల నేపథ్యంలో బీహార్ ప్రజావాణి ఎలా ఉంటుందన్న విషయమై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బీహారులో ఓడిపోతే జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లు సహా ఎన్నో బిల్లులకు మరిన్ని అడ్డంకులు ఏర్పడతాయని అంచనా. ఇక ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, వ్యాపారానికి అనువైన దేశాల జాబితాలో 130వ ర్యాంకును పొందిన భారత్ మరింత కిందకు దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరో 'బ్లాక్ మండే' వస్తుందా? రాదా? అన్న విషయం ఆదివారం సాయంత్రానికి తేలుతుంది. అయితే, మార్కెట్లు నష్టపోయినా అధైర్యపడవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్టాక్స్ విలువ దిగజారిన వేళ, మ్యూచువల్ ఫండ్స్ అద్భుత అవకాశాలను అందిస్తాయన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు, కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారికి ఈ సమయం ఎంతో అనుకూలమని సూచిస్తున్నారు. ఏదిఏమైనా, బీహారులో బీజేపీ ఓడిపోతే, తాత్కాలికంగానైనా సెంటిమెంటు దిగజారడం ఖాయం.