: గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ?...బీజేపీ నేతల ప్రతిపాదనకు పవన్ కల్యాణ్ సుముఖత
తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఇకపై మరో కొత్త పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. మరో రెండు, మూడు నెలల్లో గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి జరగనున్న ఎన్నికల్లోనే ఈ మేరకు సదరు కొత్త పార్టీ అరంగేట్రం చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ మరేదో కాదు.., టాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రారంభించిన జన సేన పార్టీనే! సార్వత్రిక ఎన్నికలకు ముందే జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ప్రకటించినా, నాడు ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ పార్టీ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. అయితే గ్రేటర్ లో జరగనున్న ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తామని అర్థం వచ్చేలా నాడే పవన్ కల్యాణ్ ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సెలవుల్లో ఎన్నికల నిర్వహణకు కేసీఆర్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల బీజేపీకి చెందిన కొంతమంది కీలక నేతలు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారట. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన... మూడు పార్టీలతో ఉమ్మడిగా బరిలోకి దిగుదామని వారు ప్రతిపాదించారని విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదనకు పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని వినికిడి. అదే జరిగితే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ తప్పదు. ఇదిలా ఉంటే, జనసేనను రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రిజిష్టర్ కూడా చేసింది. అయితే ఎన్నికల గుర్తు కేటాయించలేదు. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో ప్రాధాన్యం ఇస్తామని ఎన్నికల సంఘం జనసేనకు తెలిపింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అరంగేట్రం ఖాయమనే వాదన వినిపిస్తోంది.