: అవార్డు వెనక్కివ్వడం గర్వకారణం: అరుంధతీ రాయ్
తన జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చివేయడాన్ని గర్వంగా భావిస్తానని సామాజిక కార్యకర్త, ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ అన్నారు. ఒక ఆంగ్లపత్రికకు రాసిన ఆర్టికల్ లో ఈ విషయాన్ని ఆమె తెలిపారు. ‘అవార్డు వాపసీ’ పేరిట తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్న వారి జాబితాలో తాజాగా అరుంధతీ రాయ్ కూడా చేరారు. మన దేశంలో జరుగుతున్న సంఘటనలపై సిగ్గుపడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ లో చోటుచేసుకున్న పరిస్థితులపై నిరసన వ్యక్తం చేస్తూ పలువురు విద్యావేత్తలు, రచయితలు, ఫిల్మ్ మేకర్స్ తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక అవార్డులను వెనక్కి ఇచ్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అరుంధతీ రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ‘ఇన్ విచ్ అన్నే గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే చిత్రానికి కథను సమకూర్చినందుకు గాను 1989లో ఆమెకు జాతీయ అవార్డు లభించింది. ఆమె రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’కు బుకర్ ప్రైజ్ వచ్చిన విషయం తెలిసిందే.