: మూడో త్రైమాసికంలో ఫేస్ బుక్ కు భారీ లాభాలు... 11.3 శాతం పెరిగిన ఆదాయం
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ భారీ లాభాలు ఆర్జించింది. మూడో త్రైమాసికంలో 11.3 శాతం ఆదాయం పెరిగిందని సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో 4.5 బిలియన్ డాలర్ల రాబడి వచ్చినట్టు ఎఫ్ బీ వెల్లడించింది. అంతకుముందు త్రైమాసికంలో 4.04 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదవగా, యాక్టివ్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈసారి రాబడి పెరిగిందని పేర్కొంది. అంతేగాక మొబైల్ ప్రకటనల ఆదాయం ఏకంగా 78 శాతం పెరిగిందని, 2014 మూడో త్రైమాసికంలో ఇది 66 శాతంగా ఉందని ఫేస్ బుక్ తెలిపింది. ఇక తమకు 155 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని, ఇది ప్రతిఏటా పెరుగుతూ వస్తోందని చెప్పింది. ప్రతిరోజూ 100 కోట్ల మంది స్టేటస్ అప్ డేట్ ను షేర్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అటు సంస్థ లాభాలపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలతో యూజర్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామన్నారు.