: భారత సమస్యలు తీరేందుకు సాయం: కొత్త ఆఫర్ తో ముందుకొచ్చిన సత్య నాదెళ్ల
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన స్మార్ట్ సిటీస్ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఇండియాలోని పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యేందుకు తమ సంస్థ సహకరిస్తుందని ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న అన్ని సాంకేతిక సమస్యలూ పరిష్కరించదగ్గవేనని అభిప్రాయపడ్డ ఆయన, స్టార్టప్ కంపెనీల కోసం సింగల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. భవిష్యత్తులో క్లౌడ్, మొబిలిటీ సేవల ప్రాధాన్యాన్ని ముందే గుర్తించి, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ఔత్సాహికులకు పిలుపునిస్తూ, తమవంతు సాయానికి హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఎటువంటి సాయం అందించాలన్న విషయమై సంస్థ భారత చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని వివరించారు. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రమాణిక్ చర్చలు జరిపారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 42 రకాల సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు కొత్త ప్రాజెక్టును సైతం చేపట్టారు. వివిధ ప్రాజెక్టులను చేపట్టే కంపెనీలకు కావాల్సిన అనుమతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఫడ్నవీస్ కోరినట్టు మైక్రోసాఫ్ట్ వర్గాలు వెల్లడించాయి.