: కృపామణి కేసులో నలుగురు అరెస్ట్... ఇంకా దొరకని ప్రధాన నిందితుడు


కన్న తల్లిదండ్రులే వ్యభిచార కూపంలోకి దింపేందుకు యత్నించడంతో ఆత్మహత్య చేసుకున్న కృపామణి కేసులో పోలీసుల వేట ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో గత నెల చోటుచేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు తాను అనుభవించిన నరకయాతనను బాధితురాలు సూసైడ్ నోట్ లో పేర్కొనడమే కాక సెల్పీ వీడియోలో తన వేదనను కళ్లకు కట్టినట్టు తెలిపింది. ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఎస్పీ స్థాయి అధికారి నేరుగా రంగంలోకి దిగారు. 10 రోజులకు పైగా కొనసాగిన వేటలో బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మీ, రామలింగేశ్వరరావులతో పాటు ఆమె ఆత్మహత్యకు కారకులుగా భావిస్తున్న రాజ్ కుమార్, మంగలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే, ప్రధాన నిందితుడు, రౌడీ షీటర్ గుడాల సాయి శ్రీనివాస్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ఏకంగా లుకౌట్ నోటీస్ జారీ చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం శ్రీనివాస్ కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

  • Loading...

More Telugu News