: నిమ్స్ మాజీ డైరెక్టర్ ఇంటిలో ఏసీబీ సోదాలు... ఆసుపత్రి పరికరాల కొనుగోళ్లలో అవకతవకలే కారణం
హైదరాబాదులోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రికి సంబంధించిన వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయట. వీటిపై పక్కా ఆధారాలు సేకరించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు నేటి ఉదయం రంగంలోకి దిగిపోయారు. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్, ఉద్యోగులు ముకుందరెడ్డి, శ్రీధర్ ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. నేటి తెల్లవారుజామున నిందితుల ఇళ్లలో మొదలైన సోదాల్లో ఏసీబీ అధికారులు అణువణువూ శోధిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం:7లోని ధర్మరక్షక్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డైరెక్టర్ హోదాలో ఉన్న సమయంలో ధర్మరక్షక్ వైద్య పరికరాల సరఫరాదారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు ముకుందరెడ్డి, శ్రీధర్ ల సహకారంతో ధర్మరక్షక్ చక్రం తిప్పారట. ఈ వ్యవహారంపై పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు నిందితులతో పాటు వైద్య పరికరాలు సరఫరా చేసిన వారి ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. సోదాల అనంతరం నిందితులందరినీ నేడే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.