: రాజయ్య కోడలి కేసు ప్రాథమిక దర్యాప్తులో పోలీసుల అనుమానాలివే!
కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలి హత్య కేసులో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి సజీవ దహనం అయితే, సంఘటన జరిగినప్పుడు బాధితుల ఆక్రందనలు మిన్నంటాలి. అవి చుట్టుపక్కల వారికి వినిపించకున్నా, పై అంతస్తులో ఉన్న అత్త మామలు రాజయ్య, ఆయన భార్యకు వినిపించాలి, లేదా కింది అంతస్తులో ఉన్న భర్తకు అయినా వినిపించి ఉండాలి. అలాగే గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఉంటే మంటలు సిలిండర్ లోపలికి ప్రవేశించి పేలే ప్రమాదం ఉంది. అలా జరిగి ఉంటే ఈ దుర్ఘటన మరోలా ఉండేది. ఈ కేసులో రాజయ్య కోడలు, ఆమె పిల్లలు ఎలాంటి ఆర్తనాదాలు చేయలేదు. అంటే మంటలు వ్యాపించినట్టు వారికి తెలియలేదు. వారు దహనమైన తీరును బట్టి చూస్తే వీపు భాగాలు సరిగా కాలిన ఆనవాళ్లు లేవు. అంటే వారి శరీరంలో ముందు భాగాలు కాలిపోయాయి. కాలినప్పుడు ఎవరైనా అటూ ఇటూ పరుగెత్తే అవకాశం ఉంది. అలాంటప్పుడు వారి శరీరభాగాలన్నీ మాడిపోయే అవకాశం ఉంది. అలా జరగలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే సారికకు ముందుగానే ఏదో ఒక రూపంలో మత్తుమందు ఇచ్చి గాఢ నిద్రలోకి వెళ్లిన తరువాత పెట్రోలు పోసి దహనం చేశారని, ఆ క్రమంలోనే పిల్లలను కూడా పథకం ప్రకారం హతమార్చి వేర్వేరు ప్రాంతాల్లో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోస్టు మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తరువాతే అసలు ఏం జరిగిందనేది నిర్ధారించగలమని వారు వివరించారు. ఈ కేసు దర్యాప్తులో పలు అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని వారు చెబుతున్నారు. అందుకే ముందు 498 (ఏ) సెక్షన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, దీనికి సెక్షన్ 302ను కూడా జత చేసినట్టు తెలిపారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. విచారణ పూర్తి చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని వారు తెలిపారు.