: తోటి ఉద్యోగి భార్యకు వేధింపులు, విధులకు దూరమైన ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్
అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో సీనియర్ గ్రూప్ కెప్టెన్. చైనా నుంచి ప్రమాదం జరుగకుండా దేశాన్ని కాపాడుతున్న కీలక ఈస్ట్రన్ కమాండ్ లో పని చేస్తున్నాడు. తోటి ఉద్యోగి భార్యను, మరో యువతిని వేధించాడు. ఆయన్ను గట్టిగా ఎదిరించలేక తాము పడ్డ బాధలను వివరిస్తూ, ఆ యువతులు ఐఏఎఫ్ అధికార కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. దీంతో రక్షణ శాఖ స్పందించింది. అతనిపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విధుల నుంచి తప్పించింది. అయితే, ఆ అధికారి పేరు మాత్రం వెల్లడికాలేదు. కాగా, సైన్యంలో ఉన్నత స్థానంలో ఉండి, కింది స్థాయి సిబ్బందిపై, ముఖ్యంగా మహిళలపై వేధింపులకు పాల్పడ్డ అధికారుల ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో పలువురు అధికారులు జైళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.