: కరెంటు ఆదాకు ఇంటింటికీ రెండు ఫ్యాన్లు... ఏపీని ఎంచుకున్న కేంద్రం!
మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీని ఎంచుకుంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిన తరుణంలో ఎల్ఈడీ బల్బుల వాడకం ద్వారా కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గేలా చూసిన కేంద్రం, ఇప్పుడు ఫ్యాన్లపై దృష్టిని పెట్టింది. ప్రతి ఇంటికీ తక్కువ కరెంటును వాడే రెండు ఫ్యాన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటి ఖరీదు రూ. 1200 కాగా, ఇష్టమైన వారు తీసుకోవచ్చని, 10 లేదా 20 నెలల వాయిదాల్లో, కరెంటు బిల్లులతో పాటు ఈ డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఎల్ఈడీ బల్బుల పంపిణీని ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచే ఈ ఫ్యాన్ల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. ఈ ఫ్యాన్లు కేవలం 35 వాట్ల విద్యుత్ ను మాత్రమే తీసుకుంటాయి. ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఈ పంపిణీని పర్యవేక్షించనుండగా, తొలుత పైలట్ ప్రాజెక్టుగా మొదలు కానుంది. నరసాపురం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి విజయవంతమైతే, రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలకూ విస్తరించాలన్నది సర్కారు అభిమతం.