: డబ్బిచ్చి కలుషితం చేయొచ్చా?... హరిత పన్నుపై భగభగలు!
దేశ రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించాలంటూ, ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై వాణిజ్య వాహన యజమానులు భగ్గుమంటున్నారు. ఢిల్లీలోకి ప్రవేశించే సరుకు రవాణా వాహనాలు, ఇతర కమర్షియల్ వాహనాలు గ్రీన్ టాక్స్ (హరిత పన్ను) చెల్లించాలని వెల్లడైన ఆదేశాలను ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ గూడ్స్ వెహికిల్ ఓనర్స్ అసోసియేషన్ తప్పుబట్టింది. ఈ ఆదేశాలు "డబ్బిచ్చి కలుషితం చేయి" అన్నట్టుగా ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు భూరీలాల్, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కు లేఖ రాశారు. మొత్తం కాలుష్యంలో వాణిజ్య వాహనాలు వెదజల్లే వాయువుల పరిమాణం అతి స్వల్పమని, ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే గ్రీన్ టాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తేలికపాటి వాహనాలపై రూ. 700, మల్టీ యాక్సిల్ ట్రక్కులపై రూ. 1,300 వసూలు చేసేందుకు అక్టోబర్ లో సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.