: ‘సిరిసిల్ల’ స్థానంలో ‘సర్వే’... అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్
వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారిపోయారు. సిరిసిల్ల రాజయ్య స్థానంలో సర్వే సత్యనారాయణ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ సర్వే పేరును అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధిష్ఠానం ప్రకటనతో నేటి మధ్యాహ్నం సర్వే తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే బరిలోకి దిగిన సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో పాటు ఆమె ముగ్గురు పిల్లలూ సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో షాక్ కు గురైన రాజయ్య తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని అధిష్ఠానికి తేల్చిచెప్పేశారు. మరోవైపు నేటితో వరంగల్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దీంతో పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ఓ వైపు స్థానిక నేతలు, మరోవైపు ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరుపుతూనే బీ ఫారం తీసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ కు బయలుదేరారు. ఇప్పటికే వరంగల్ టికెట్ కోసం యత్నించిన సర్వే సత్యనారాయణ సఫలీకృతం కాలేకపోయారు. అయితే పార్టీ అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడంతో సర్వేకు మార్గం సుగమమైంది. అధిష్ఠానం ఆదేశాలతో సర్వే సత్యానారాయణ వరంగల్ బయలుదేరారు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో అధిష్ఠానికి కూడా సర్వేను మించిన ప్రత్యామ్నాయం దొరకలేదు. దీంతో సిరిసిల్ల రాజయ్య స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణను పార్టీ ప్రకటించింది. మరికాసేపట్లో వరంగల్ చేరుకోనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఫారాన్ని సర్వేకు అందజేస్తారు. ఆ తర్వాత సర్వే నామినేషన్ దాఖలు చేయనున్నారు.