: మా అత్త సూర్యకాంతాన్ని మించిపోయారు...కొడుక్కి రెండో పెళ్లి చేశారు: వెలుగులోకొచ్చిన సారిక ఆవేదన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక గతంలో వెలిబుచ్చిన ఆవేదనను ఓ తెలుగు టీవీ చానెల్ వెలుగులోకి తెచ్చింది. నేటి తెల్లవారుజామున వరంగల్ లోని రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా సారిక సజీవ దహనమైంది. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో తెలుగు టీవీ చానెళ్లలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా ఓ తెలుగు చానెల్ గతంలో సారిక మీడియాతో మాట్లాడిన పాత వీడియోను ప్రసారం చేసింది. తన భర్తతో పాటు అత్తామామలు తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని సారిక ఆవేదన వ్యక్తం చేసింది. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో అనిల్ తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని, 2006లో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని ఆమె తెలిపింది. ఆ తర్వాత పుణేలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో తాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశానని ఆమె తెలిపింది. ఆ సమయంలోనే తనకు పెద్ద కుమారుడు పుట్టాడని, తదనంతరం తనకు హైదరాబాదులోని ఐబీఎం కంపెనీలో ఉద్యోగం రాగా కూకట్ పల్లిలో ఇల్లు తీసుకున్నానని చెప్పారు. ఈ సమయంలో ఏడాదిన్నరగా తన వద్దకు తన అత్తామామలు అసలే రాలేదని వాపోయారు. తనను కాకున్నా తన కుమారుడిని అయినా చూసేందుకు వారు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె తన అత్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. వేధింపుల్లో తన అత్త సూర్యకాంతాన్ని మించిపోయారని ఆరోపించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న కొడుకును మందలించాల్సిన బాధ్యతను మరిచి అతడిని ప్రోత్సహించిందని పేర్కొంది. అంతేకాక తానుండగానే తన భర్తకు రెండో పెళ్లి కూడా చేసిందని తెలిపింది. ఇదేంటని ప్రశ్నించిన తనపైనే అంతెత్తున ఎగిరిపడిందని వాపోయింది. ఈ క్రమంలో తాను ఉద్యోగం చేస్తున్నాను కదా, తన వద్ద ఉంటే బాగుంటుంది కదా అని అభ్యర్థించానని సారిక తెలిపింది. దీంతో తనపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన అనిల్ తన ఉద్యోగాన్ని అవహేళన చేయడమే కాక ‘‘నేను కావాలంటే ఉద్యోగాన్ని వదిలి వచ్చేయి’’ అని చెప్పాడని తెలిపింది. దీంతో ప్రతిష్ఠాత్మక సంస్థలో చేస్తున్న తన ఉద్యోగాన్ని వదిలి వరంగల్ చేరానని ఆమె తెలిపింది. ఇక అక్కడి నుంచి తనకు వేధింపులు మరింత పెరిగిపోయాయని, ఈ కారణంగానే తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని కూడా సారిక తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పింగ్ సంచలనం రేపుతోంది.