: పెద్దమ్మ తల్లికి పూజలు చేసి, అవుకు జలాశయంలో ఒకేసారి దూకేసిన 8 మంది
అప్పులు తీర్చే దారిలేక ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది కర్నూలు జిల్లా అవుకు జలాశయంలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. వీరంతా దోర్నిపాడు మండలం కిష్టిపాడుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే వాహనంలో వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఐదురుగు మృతి చెందారని, మరో ముగ్గురిని స్థానికులు రక్షించారని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సమీపంలోని పెద్దమ్మ తల్లి గుడిలో వీరంతా పూజలు చేశారని వివరించారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రామయ్య, ఆయన ఇద్దరు కుమారులు వెంకటేశ్వర్లు, లక్ష్మీ నారాయణ. వీరంతా శనగల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారంలో నష్టం రావడం, పంటను అమ్ముకున్న రైతుల నుంచి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి పెరగడంతో వీరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రామయ్య, ఆయన కుమారులు, కోడళ్లు, ఇద్దరు మనవలు, మనవరాలితో కలసి జలాశయం వద్దకు వచ్చి ఒకేసారి దూకారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురి మృతదేహాలు లభించగా, మరో ఇద్దరి దేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.