: వినయంలోనూ ప్రత్యేకమే!...క్యూరేటర్ కు పాదాభివందనం చేసిన కోహ్లీ
టీమిండియా చిచ్చర పిడుగు, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగితే, ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తాల్సిందే. ఎందుకంటే బౌలర్ ఎవరు, బంతి ఎలా వస్తోంది అన్న విషయాలతో సంబంధం లేకుండా విరుచుకుపడతాడు. తనపై స్లెడ్జింగ్ కు దిగే ప్రత్యర్థి జట్ల క్రికెటర్లపై అదే స్థాయిలో ఎదురు సమాధానం చెప్పడంలోనూ అతడికి అతడే సాటి. ఇలాంటి సమయాల్లో అతడిలో దాదాపు ఓ కోపిష్టి మనకు కనిపిస్తాడు. అయితే కోపంలోనే కాక వినయంలోనూ తనకు తానే సాటి అని నిరూపించాడు కోహ్లీ. నిన్న మొహాలీ పిచ్ లోకి అడుగిడిన కోహ్లీ, పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ కు పాదాభివందనం చేశాడు. దాదాపు 23 ఏళ్లుగా పిచ్ క్యూరేటర్ గా ఉన్న దల్జీత్ సింగ్... కోహ్లీని చిన్నతనం నుంచి టెస్టు జట్టు కెప్టెన్ గా ఎదిగే దాకా ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే 73 ఏళ్ల దల్జీత్ సింగ్ కు కోహ్లీ పాదాభివందనం చేశాడు.