: మహిళల భద్రత కోసం ‘రైల్వే’ కొత్త యాప్
మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. రైళ్లలో మహిళా ప్రయాణికులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ యాప్ ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సహాయంతో దీనిని రూపొందించనున్నట్లు వివరించారు. పశ్చిమ రైల్వే మహిళల భద్రత కోసం ఇప్పటికే యాప్ విడుదల చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందుకుగాను రైళ్లలో సీసీ టీవీలను పశ్చిమ రైల్వే ఏర్పాటు చేసిందన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సీఎంలకు లేఖలు రాశామన్నారు. రైళ్లలో దొంగతనాల నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని ఆర్పీఎఫ్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి సురేష్ ప్రభు ఈ యాప్ గురించి వివరించారు.