: ప్రియుడ్ని వెతుక్కుంటూ దేశం వీడిన ప్రియురాలు
ప్రియుడ్ని వెతుక్కుంటూ దేశం దాటిందో ప్రియురాలు. దేశం కాని దేశంలో 20 రోజులపాటు ప్రియుడి జాడకోసం నిర్విరామంగా వెతుకుతోంది. వివరాల్లోకి వెళ్తే... చైనాకు చెందిన తీన్ డామి అలియాస్ డాలీ అనే యువతి ఓ మెడికల్ కళాశాలలో క్లర్క్ గా పని చేస్తోంది. అదే కళాశాలలో మెడిసిన్ అభ్యసిస్తున్న పాకిస్థాన్ యువకుడు అమీన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడి ఫీజు కోసం ఉన్న ఇంటిని కూడా అమ్మేసింది డాలీ. నెల రోజుల క్రితం డాలీకి చెప్పాపెట్టకుండా అమీన్ పాకిస్ధాన్ వెళ్లిపోయాడు. దీంతో ప్రియుడి అడ్రెస్ వెతుక్కుంటూ డాలీ పాకిస్థాన్ చేరుకుంది. గత 20 రోజులుగా ఇస్లామాబాద్, ముజఫర్ గఢ్ ప్రాంతాలన్నీ గాలిస్తోంది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించడంతో ఆమె కథనం బయటపడింది. దీంతో ఆమెను చైనా దౌత్యకార్యాలయానికి అప్పగించారు పాక్ పోలీసులు. అయితే ప్రియుడిని కలిసిన తరువాతే చైనాకు వెళ్తానని, అంతవరకు పాక్ వీడే ప్రసక్తి లేదని డాలీ చెబుతోంది. కాగా, అమీన్ కుటుంబ సభ్యులను సంప్రదించగా అమీన్ చైనాలోనే ఉన్నాడని చెప్పడం విశేషం.