: జరుగుతున్న హత్యలపై మనం భారతీయులుగా స్పందించాలి: రాహుల్ గాంధీ
మన దేశంలో జరుగుతున్న ఘటనలపై భారతీయులుగా స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీ సరైన దిశలో పయనించడం లేదని అన్నారు. దేశంలో ప్రతి సంఘటనపై ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదనే బీజేపీ వాదన అంగీకారయోగ్యమైనా, ఓపక్క మనుషులు మరణిస్తుంటే కూడా స్పందించకపోతే ప్రధాని ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. దేశంలో పలు చోట్ల జరుగుతున్న హత్యలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆయన కోరారు. మతం ముసుగులో మనుషులను తగలబెట్టేస్తుంటే, కొట్టి చంపేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశంలో ఏం జరగడం లేదని వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. దేశ రాజధానికి కూతవేటు దూరంలో జరుగుతున్న సంఘటనలపైనే స్పందించకపోతే, మారుమూల జరిగే సంఘటనలపై ఇంకెలా స్పందిస్తారని ఆయన నిలదీశారు.