: నెబ్రాస్కా ఓమహాలో లలిత కళామండలి ఆధ్వర్యంలో ఘనంగా దసరా నాటక ఉత్సవాలు


అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని నెబ్రాస్కా ఓమహాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారతీయ కళలు, సంస్కృతిని కాపాడుకోవడానికి, యువతీ యువకులలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీయడానికి 'లలిత కళామండలి' అనే సాంస్కృతిక సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ ఒకటిన 'ఓమహా హిందూ టెంపుల్ ఆఫ్ నెబ్రాస్కా'లో దసరా పండుగ సందర్భంగా నాటక ప్రదర్శనలు జరిగాయి. అత్యంత వైభవంగా జరిగిన ఈ నాటక ప్రదర్శనలు అక్కడి తెలుగువారిని విశేషంగా ఆకర్షించాయి. యువతీ యువకులు డాలర్ల మోజులో అమెరికాకు వచ్చి కన్న తల్లిదండ్రులను, జన్మభూమిని ఎలా విస్మరిస్తున్నారు? అనే అంశాన్ని 'NRI' ఎన్.ఆర్.ఐ. (See in yourself) అనే నాటకం ద్వారా దర్శకుడు కొల్లి ప్రసాద్ ఆకట్టుకునేలా విడమరచి చెప్పారు. తను ప్రమాదానికి గురైనప్పుడు కట్టుకున్న భార్య దూరమవడంతో, ఓ యువకుడికి తిరిగి తల్లిదండ్రుల అవసరం ఎలా ఏర్పడింది? అనే విషయాన్ని ఇందులో హృద్యంగా చెప్పిన తీరు ఆద్యంతం ప్రేక్షకులను రెప్పవాల్చనీయకుండా చేసింది. కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకులను కంట తడి పెట్టించాయి కూడా. ఈ నాటకంలో ప్రధాన పాత్రదారులైన దిలీప్, శ్వేత వెల్లంకి, రంగనాథ్ మండల శ్రీ, స్వప్న బోడేపూడి, నాగరాజు తమ నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అలాగే మరో నాటకం 'మహిషాసురమర్ధిని' విజయదశమి ప్రాముఖ్యతను, అసలు దసరా పండుగ ఎలా వచ్చింది? అనే విషయాలను ఆసక్తికరంగా వివరించింది. శివ గంగ దర్శకత్వంలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. శివుడిగా దర్శకుడు శివగంగ, దుర్గాదేవిగా మల్లికా జయంతి, మహిషాసురుడిగా రాజీవ్ దొడ్డపనేని, విష్ణువుగా వేణు వెల్లంకి, బ్రహ్మగా మధుసూదన్ రావు గొర్రెపాటి, ఇంద్రుడిగా రాజేష్, రంబు కరంబుగా రంగ, సూర్య మారెడ్డి నటించారు. దేవకన్యలుగా తేజస్విని బోయినపల్లి, శ్రీలక్ష్మి కొల్లి, నిహేల పోన్నాట, అదితి గుండా, చైత్ర పిరిసింగుల, వాసవి కోటిపల్లి తమ ప్రతిభను కనబరిచారు, అనన్య దాట్ల, శ్వేతా వెల్లంకి తల్లీకూతుళ్లుగా నటించారు. వీరి నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఇండియా నుంచి వచ్చిన ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ రమేష్ కు ఎక్స్ లెన్సు అవార్డ్ ను లలితకళామండలి బహూకరించి సత్కరించింది. అంతకు ముందు రమేష్ చేసిన మిమిక్రీ ప్రేక్షకులను బాగా అలరించిది. సుమారు 8 వేల ప్రదర్శనలు పూర్తి చేసుకోవడంతో పాటు, అనేక సేవా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న రమేష్ కు ఈ అవార్డ్ ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలను తన మిమిక్రీతో గత 25 సంవత్సరాలుగా అలరిస్తున్న రమేష్ కు అవార్డ్ ను బహుకరించినట్టు కొల్లి ప్రసాద్ తెలిపారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా అమల దుగ్గిరాల, సుందర చొక్కర, నాగేశ్వర్ రావు ఆతోట హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రత్యూష కాంచన వ్యవహరించారు, కార్యక్రమం ప్రారంభానికి ముందు రావు ఉట్ల, శ్రీనివాస్ తూటిగా, సాగర్ లు గణపతి ప్రార్ధన గీతం ఆలపించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన స్థానిక వ్యాపారసంస్థలు, దాతలకు కళామండలి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

  • Loading...

More Telugu News