: జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్... తొలగించిన ఓట్లపై లెక్కలివే !
మహానగరంలో తొలగించిన ఓట్ల లెక్కను కేంద్ర ఎన్నికల అధికారుల బృందం ఎట్టకేలకు తేల్చింది. ఈ బృందం నాలుగు రోజుల పాటు చేపట్టిన తనిఖీ, పరిశీలనలు ముగిశాయి. తెలంగాణ సర్కార్ తనకు అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగిస్తోందంటూ పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వారు తనిఖీ, పరిశీలనలు చేపట్టిన విషయం తెలిసిందే. తొలగించిన ఓట్ల లెక్క వివరాల విషయానికొస్తే... గ్రేటర్ లోని మొత్తం 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 51,93,119 మంది ఓటర్లున్నారు. వీటిలో సుమారు 6,25,700 ఓట్లను తొలగించినట్లు లెక్కలు సేకరించారు. ఇందులో సగం మంది ఓటర్లకు నోటీసులివ్వకుండానే వారి ఓట్లను తొలగించినట్లు ఈ బృందం చేపట్టిన తనిఖీల ద్వారా పసిగట్టింది. ఒక డివిజన్ లో మొత్తం 240 మంది ఓట్లను తొలగించగా, అందులో 140 మందికి మాత్రమే నోటీసులిచ్చింది. మిగిలిన వారికి ఎటువంటి నోటీసులివ్వకుండానే వారి ఓట్లను తొలగించింది. ఈ సమాచారాన్ని కూడా బృందం సేకరించింది. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 33శాతం ఓట్లను తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తగా, శివారుల్లోని శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో కూడా భారీగానే ఓట్ల తొలగింపు జరిగిందన్న విషయం సైతం బయటపడింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో, అలాగే శివారు నియోజకవర్గాలు మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఓట్ల తొలిగింపు వ్యవహారంపై ఓటు నమోదు అధికారి, అసిస్టెంటు ఎలక్ట్రోల్ రిజిష్టర్ ఆఫీసర్లతో పాటు బూత్ లెవెల్ అధికారులను సైతం ఎన్నికల బృందం ప్రశ్నించినట్లు తెలిసింది. ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ బృందం సమర్పించే నివేదికల ఆధారంగా ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.