: 'ఉబర్ క్యాబ్' అత్యాచారం కేసులో డ్రైవర్ కు జీవిత ఖైదు
'ఉబర్ క్యాబ్' అత్యాచార ఘటన కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషి అయిన డ్రైవర్ శివకుమార్ యాదవ్(32)కు జీవితకాల శిక్ష విధిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. గుర్గావ్ లో పనిచేసే 25 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్ 2014, డిసెంబర్ 5న రాత్రి సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ ఎక్కింది. ఇంటికి వచ్చే క్రమంలో కారు డ్రైవర్ యాదవ్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా... గొంతు నులిమి చంపేందుకు కూడా ప్రయత్నించాడు. తరువాత ఘటన గురించి పోలీసులకు తెలియడంతో రెండు రోజులకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ జరగ్గా అక్టోబర్ 20న యాదవ్ ను కోర్టు దోషిగా నిర్థారించింది. ఇక ఇవాళ శిక్ష విధించే అంశంపై ట్రయల్ కోర్టులో వాదనలు జరిగాయి. ఇటువంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి గరిష్ట శిక్ష విధించి సమాజానికి బలమైన సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. గతంలో కూడా యాదవ్ ఇలాంటి క్రిమినల్ నేరాలకు పాల్పడ్డాడని అన్నారు. ఈ నేపథ్యంలో దోషి పట్ల కనికరం చూపాల్సిన అవసరంలేదని ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి కావేరీ బవేజా ప్రాసిక్యూషన్ వాదనలను అంగీకరిస్తూ, దోషికి యావజ్జీవ శిక్ష విధిస్తూ 99 పేజీల తీర్పును చదివారు.