: బాలిలో దావూద్ షూటర్లు?... ఇండోనేసియాలోనే చోటా రాజన్ ను మట్టుబెట్టే యత్నం


మాఫియా డాన్ చోటా రాజన్ ను ఇండోనేసియా గడ్డపైనే మట్టుబెట్టే యత్నం జరుగుతోందా? అంటే, అవుననే అంటున్నాయి పలు మీడియా కథనాలు. దాదాపు రెండు దశాబ్దాల వేట తర్వాత చోటా రాజన్ ను ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో ఇండోనేసియా పోలీసులు బాలిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు బాలి జైల్లో ఉన్నాడు. అతడిని భారత్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే చోటా రాజన్ భారత్ వస్తే, తన గుట్టుమట్లు అన్నీ భారత నిఘా వర్గాలకు చిక్కినట్లేనని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బెంబేలెత్తిపోతున్నాడు. పాకిస్థాన్ లో ఐఎస్ఐ భద్రతలో సురక్షితంగా ఉన్న దావూద్, చోటా రాజన్ అరెస్ట్ వార్తతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. ఎలాగైనా చోటా రాజన్ భారత్ లో అడుగుపెట్టకూడదన్న కోణంలో పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇప్పటికే సదరు ప్రణాళికలను అతడు అమలులో పెట్టేశాడన్న వార్తలూ వినిపిస్తున్నాయి. దావూద్ గ్యాంగ్ లోని కీలక సభ్యులు కొందరు ఇప్పటికే బాలి చేరుకున్నారట. బాలిలోని స్థానిక షూటర్స్ తో సంప్రదింపులు జరిపిన దావూద్ మనుషులు, చోటా రాజన్ ను మట్టుబెట్టేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారట. భారత్ విమానం ఎక్కేలోగా చోటా రాజన్ ను మట్టుబెట్టాలని బాలి షూటర్లను దావూద్ మనుషులు కోరుతున్నారట. ఇందుకోసం ఎంత మొత్తంతో డబ్బు ముట్టజెప్పేందుకైనా వారు వెనుకాడటం లేదట. దీంతో చోటా రాజన్ ను భారత్ కు సురక్షితంగా తరలించే విషయంలో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News