: ఇక పరిటాల వంతు!... బెజవాడ ‘రెయిన్ ట్రీ’కి తరలనున్న ఏపీ పౌరసరఫరాల శాఖ
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా హైదరాబాదు నుంచే పాలనా వ్యవహారాలను కొనసాగించేందుకు ఇష్టపడని చంద్రబాబు విజయవాడలో వేగంగా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు కూడా తమ కార్యాలయాలను విజయవాడ తరలించుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు శాఖలకు సంబంధించిన మెజారిటీ కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచి సాగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా ఇదే బాటలో వడివడిగా అడుగులేస్తున్నారు. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కూడా తన కార్యాలయాన్ని హైదరాబాదు నుంచి విజయవాడకు తరలించే పనిలో పడ్డారు. నిన్న ఏపీ కేబినెట్ భేటీ కోసం విజయవాడ వెళ్లిన పరిటాల సునీత, నేటి ఉదయం రెయిన్ ట్రీలో ఉన్న భవనాలను పరిశీలించారు. రెయిన్ ట్రీలోని భవనాల్లోనే ఆమె తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.