: కోల్ బ్లాక్ ల కేటాయింపులో దాసరి, మధుకోడాలు కుట్రపన్నారు... కోర్టులో సీబీఐ వాదన
బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కాంలో ఇప్పటివరకు తనకేమి సంబంధంలేదంటూ వాదిస్తూ వచ్చిన బొగ్గుగనుల శాఖ మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావు చిక్కుల్లో పడేలా ఉన్నారు. రెండు జిందాల్ గ్రూప్ కంపెనీలైన జిందాల్ స్టీల్ అండ్ పవర్, గగన్ స్పాంజ్ ఐరన్ లకు అమరకొండా ముర్గాదంగల్ కోల్ బ్లాక్ కేటాయించేందుకు దాసరి, నవీన్ జిందాల్, మాజీ సీఎం మధు కోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సీ గుప్తా తదితరులు కుట్రపన్నారని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వాన్ని వారు ప్రభావితం చేశారని చార్జ్ షీట్ లో పేర్కొంది. దాసరి, కోడా, జిందాల్ సహా మొత్తం 11 మందిపై దాఖలైన చార్జ్ షీట్ పై ప్రత్యేక కోర్టు విచారణ జరపగా సీబీఐ వాదనలు వినిపించింది. అయితే దాసరి, జిందాల్ పై సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనలను వారిద్దరి తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సమయంలో తన క్లయింటుకు జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయంతో ఎలాంటి సంబంధంలేదని దాసరి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపు జరిపిన స్క్రీనింగ్ కమిటీ నిర్ణయంలో దాసరి ప్రమేయం లేదని, అప్పట్లో బొగ్గు శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.