: కృష్ణా కరకట్టలపై సీసీ కెమెరాలు... చంద్రబాబు భద్రత కోసమేనట!
కృష్ణా జిల్లాలోని ముఖ్య నగరం, నవ్యాంధ్ర నూతన రాజధానికి అతి సమీపంలోని ఏపీ రాజకీయ కేంద్రం విజయవాడ నగర సమీపంలోని కృష్ణా నది కరకట్ట (నది ఒడ్డు)లపై కొత్తగా సీసీ కెమెరాలు దర్శనమివ్వనున్నాయి. ఎందుకంటే, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అక్కడే ఉంటున్నారు కదా. చంద్రబాబు భద్రతపై సమీక్ష చేసిన పోలీసు బాసులు ఈ మేరకు నిర్ణయించారు. కృష్ణా కరకట్టలపై లింగమనేని గ్రూప్ నిర్మించిన అధునాతన గెస్ట్ హౌస్ ను చంద్రబాబు తన తాత్కాలిక నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ లు కూడా అక్కడే ఉంటున్నారు. ఇక విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లడం, తిరిగి రావడం కూడా కృష్ణా కరకట్టలపైనే జరుగుతోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు భద్రతపై సమీక్షించిన పోలీసులు, కరకట్టపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయక తప్పదని నిర్ణయించడంతో, త్వరలోనే ఈ ఏర్పాట్లు జరగనున్నాయట.