: బెజవాడ ‘వాల్ మార్ట్’ లో పరిటాల సునీత... అడుగడుగూ తనిఖీ చేసిన వైనం
మల్టీ నేషనల్ చైన్ స్టోర్ జెయింట్ ‘వాల్ మార్ట్’లో నిన్న ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రత్యక్షమయ్యారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో నిన్న విజయవాడకు చేరుకున్న మంత్రి పనిలో పనిగా వాల్ మార్ట్ విక్రయాలపై దృష్టి సారించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మంత్రి విజయవాడలోని నిడమానూరు వద్ద ఉన్న వాల్ మార్ట్ కు వెళ్లారు. చెప్పా పెట్టకుండా మంత్రి తమ స్టోర్ లో అడుగుపెట్టడంతో అక్కడి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే ఇవేమీ పట్టించుకోని మంత్రి నేరుగా మార్ట్ లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న విక్రయాలను పరిశీలించారు. మార్ట్ లో ఉంచిన వివిధ ఉత్పత్తులు, వాటి ధరలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా కందిపప్పు విక్రయాలపై మంత్రి ఆరా తీసినట్లు సమాచారం.