: హాస్య నటుడు కొండవలస ఇక లేరు!
తెలుగు సినిమా హాస్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు సోమవారం రాత్రి హైదరాబాదులో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను నిమ్స్ కు తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొండవలస లక్ష్మణరావు శ్రీకాకుళం జిల్లా కొండవలసలో 1946 ఆగస్టు 10న జన్మించారు. ఆయన దాదాపు 300 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన విశాఖ పోర్టు ట్రస్టులో పని చేశారు. వంశీ దర్శకత్వంలో రూపొందిన `ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో కొండవలస తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో 'ఐతే ఓకే' డైలాగ్తో ఆయన ప్రాచుర్యం పొందారు. తరువాత పలు చిత్రాల్లో తనదైన హాస్యం ద్వారా ప్రేక్షకులకు కొండవలస వినోదాన్ని పంచారు. ఆయన వెయ్యికి పైగా నాటకాలలో నటించారు. ఆయన నాటక రంగంలో రెండు నంది అవార్డులు కూడా అందుకున్నారు.