: 'హీరో'లు ఎవరు? అని అడుగుతున్న జక్కన్న
థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు 'ఈ నగరానికి ఏమైంది...ఓ వైపు నుసి, మరోవైపు పొగ' అంటూ ఓ యాడ్ ప్రత్యక్షమవుతుంది. దానిని చూసి కళ్లు మూసుకున్నవారు కొందరైతే, ముఖం తిప్పుకునే వారు మరికొందరు. ఇంకా విశేషం ఏమిటంటే, సినిమా విశ్రాంతి సమయంలో ఓ దమ్ము వేసేందుకు వెళ్తారు కొందరు. ఇలా ఆ అవగాహనా ప్రచారం దారి దానిదే, జనం దారి జనందే! ఈ నేపథ్యంలో, ఎలాగైనా ప్రజల్లో ధూమపానంపై చైతన్యం తీసుకురావాలని భావించిన ఓ ప్రముఖ ఆసుపత్రి స్మోకింగ్ పై ప్రచారం ప్రారంభించింది. ఆ ప్రచారంలో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళితో ఓ లఘు చిత్రం రూపొందించింది. అందులో 'హీరో అంటే ఎగ్జాక్ట్ గా ఎవరు?' అని ప్రశ్నిస్తారు. హీరో అంటే సూపర్ మ్యాన్, అమితాబ్, మహేశ్ బాబు, బాహుబలి, క్రిష్...అంటూ సమాధానాలు విన్నాక...అవును వీరంతా హీరోలే...మీరు కూడా హీరోలవ్వచ్చు...ధూమపానాన్ని వ్యతిరేకించి, మీ జీవితానికి మీరే హీరోలు కావచ్చు' అంటూ ఆయన ఈ లఘుచిత్రంలో కనిపిస్తారు.