: నామినేషన్లు వేసిన పసునూరి, సిరిసిల్ల... ఇక ఎన్డీఏ అభ్యర్థిదే ఆలస్యం!
తెలుగు రాష్ట్రాల్లో పెను ఆసక్తి రేపుతున్న వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు క్రతువు ముగిసింది. చతుర్ముఖ పోటీ నెలకొన్న ఈ స్థానంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పసునూరి దయాకర్ ను అధికార టీఆర్ఎస్ రంగంలోకి దించగా, తీవ్ర తర్జనభర్జనల అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను తన అభ్యర్థిగా ఖరారు చేసింది. కొద్దిసేపటి క్రితం పసునూరి దయాకర్, సిరిసిల్ల రాజయ్య తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న గాలి వినోద్ కుమార్ కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి నామినేషన్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 4తో నామినేషన్ల గడువు ముగియనుంది. నామినేషన్ల గడువు ముంచుకొస్తున్నా టీడీపీ-బీజేపీ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.