: ప్రధానిపై తీవ్ర విమర్శలు చేసిన లాలూ తనయుడు
ప్రధాని నరేంద్ర మోదీ చెవిటి, మూగవాడని, తన పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న బంధుప్రీతిని, స్వాభిమానాన్ని ఆయన చూడలేకపోతూ గుడ్డివాడిగా కూడా మారాడని బీహార్ యువనేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పీడీపీలోని తండ్రి, కుమార్తెలు, శివసేనలోని వారసత్వం, ఎల్జేపీ, ఎస్ఏడీ పార్టీల్లో తండ్రి రాజకీయ వారసత్వం ఎవరికి వెళ్లిందన్న విషయం మోదీకి తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీలోని మేనకా గాంధీ, వరుణ్ గాంధీల సంగతేమిటని, రాజస్థాన్ లో వసుంధరా రాజే, దుష్యంత్ ల మధ్య బంధం ఏంటని అడిగారు. రమణ్ సింగ్, ఆయన కుమారుడు అభిషేక్ లను, యశ్వంత్, జయంత్ సిన్హాలను, రాజ్ నాథ్, పంకజ్ సింగ్ లను ప్రస్తావించిన ఆయన, వారంతా అగ్రవర్ణాల వారు కాబట్టే వారసత్వంగా రాజకీయాన్ని స్వీకరించడానికి అర్హులని మోదీ భావిస్తున్నట్టు అనుకోవాలా? అని ప్రశ్నించారు. మోదీ అన్ని పరిధులను దాటి విమర్శలు గుప్పిస్తూ, తన పదవికే చేటు తెచ్చుకుంటున్నారని, ఇప్పుడు బీహార్ ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారని తేజస్వీ విమర్శించారు.