: ఎన్టీఆరే వచ్చినా టీడీపీ బతకదు!... తెలంగాణ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్య
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చకే దారి తీశాయి. ‘‘సాక్షాత్తు స్వర్గీయ నందమూరి తారకరావు వచ్చినా, తెలంగాణలో టీడీపీ బతకదు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొన్నటిదాకా టీడీపీలోనే కీలక నేతగా ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో కేసీఆర్ కేబినెట్ లో ఆయనకు కీలక మంత్రిత్వ శాఖనే దొరికింది. తెలుగు జాతి ఆత్మగౌరవం పేరిట నాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో తొలి నాళ్లలోనే చేరిన తుమ్మల పార్టీలో అగ్రనేతగా ఎదిగారు. అప్పటిదాకా కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఆయన జీవం పోశారు. పార్టీ ప్రతిష్ఠతకు తుమ్మల చేసిన కృషిని గుర్తించిన టీడీపీ ఆయనకు కీలక పదవులనే ఇచ్చి సత్కరించింది. ఈ కారణంగానే పార్టీ మారుతున్న క్రమంలో తుమ్మల కంట కన్నీరు కూడా కారింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఇక టీడీపీకి నూకలు చెల్లినట్లేనని నిన్నటి టీవీ ఇంటర్వ్యూలో తుమ్మల పేర్కొన్నారు.