: రన్నింగ్ లో తెగిన లింక్... పట్టాలపై బోగీలు, ముందుకెళ్లిపోయిన ఇంజిన్!
దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రైలు రన్నింగ్ లో ఉండగానే బోగీలతో ఇంజిన్ కు లింక్ తెగిపోయింది. దీంతో రైలు పట్టాలపైనే బోగీలు నిలిచిపోగా, ఇంజిన్ మాత్రం గమ్యస్థానానికి చేరిపోయింది. తీరా రైలు స్టేషన్ లో నిలిచిన తర్వాత చూసుకున్న ఇంజిన్ డ్రైవర్ షాక్ తిన్నాడు. ఇంజిన్ వెనకాల ఉన్న బోగీలు కనపడకపోవడంతో అతడు ఇంజిన్ ను మళ్లీ వెనక్కు తిప్పాడు. లింక్ తెగిన నేపథ్యంలో రైలు పట్టాలపై మార్గమధ్యంలోనే నిలిచిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్ కు తగిలించుకుని గమ్యస్థానానికి బయలుదేరాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి గుంతకల్లు బయలుదేరిన తిరుపతి-గుంతకల్లు ప్యాసెంజర్ మరికాసేపట్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుందనగా ఈ ప్రమాదం సంభవించింది. ఇంజిన్ తో లింక్ తెగిపోయినా, పట్టాలపైనే బోగీలు నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. అంతేకాక మరో రైలు ఆ పట్టాలపైకి రాకముందే డ్రైవర్ గుర్తించిన కారణంగా పెను ప్రమాదం తప్పింది. బోగీలను వదిలి ఇంజిన్ వెళ్లిపోవడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరుపై వారు ఆరా తీస్తున్నారు.