: టీఆర్ఎస్ కు ఝలక్కిచ్చిన ఓయూ జేఏసీ... కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని ప్రకటన
వరంగల్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ కు నిన్న మరో షాక్ తగిలింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి (ఓయూ జేఏసీ) టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ప్రకటించింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య గెలుపు కోసం పనిచేయనున్నట్లు ఓయూ జేఏసీ నేత మానవతారాయ్ నిన్న ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలనకు చెక్ పెట్టడానికి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వరంగల్ సీటును కానుకగా ఇస్తామని ఆయన ప్రకటించారు.