: భజ్జీ దంపతులకు ప్రధాని ఆశీస్సులు... రిసెప్షన్ కు హాజరైన మాజీ కాప్ కేపీఎస్ గిల్!
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాహ విందు (రిసెప్షన్) నిన్న ఢిల్లీలో వేడుకగా జరిగింది. భజ్జీ ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటతో కొద్దిసేపు ముచ్చటించిన మోదీ వేడుకకు హాజరైన అతిథులనూ పలకరించారు. ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరయ్యారు. ఇక పంజాబ్ డీజీపీగా పనిచేసి ఉగ్రవాదం అణచివేతలో పేరుగాంచిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేపీఎస్ గిల్ కూడా ఈ వేడుకకు వచ్చారు. వేడుకలో ఆయన ప్రధాన ఆకర్షణగా నిలిచారు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలు సహా దాదాపుగా జట్టు సభ్యులంతా విందుకు వచ్చారు. విందులో జట్టు మాజీ సభ్యుడు యువరాజ్ సింగ్ తో కలిసి కోహ్లీ సందడి చేశాడు. ఇక ఈ విందుకు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ టాప్ స్టార్లు షారుఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రా తదితరులు కూడా హాజరయ్యారు.