: నా కొడుకు డాన్ కాదు... మీడియా కథనాలపై తలసాని ఫైర్
తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నిన్న మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు డాన్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. టెన్నిస్ క్రీడాకారిణి భువన భర్తపై తలసాని కుమారుడు సాయికిరణ్ దాడి చేశాడని మూడు రోజుల క్రితం వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. దీనిపై మొన్న, నిన్న కూడా పలు కోణాల్లో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిని కాస్త సీరియస్ గా పరిగణించిన తలసాని నిన్న భువన, ఆమె తండ్రి మహేంద్రనాథ్ రెడ్డితో కలిసి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. మహేంద్రనాథ్ రెడ్డి తన ఇంటికి వచ్చినప్పుడు తాను ఇంటిలో లేని కారణంగానే తన కుమారుడు ఆయనతో మాట్లాడారని తలసాని చెప్పారు. విషయాన్ని సాంతం విన్న తన కుమారుడు, తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని బాధితుడికి హామీ మాత్రమే ఇచ్చాడని పేర్కొన్నారు. దీనిపై పలు మీడియా సంస్థలు అసత్య కథనాలతో వార్తలు రాశాయని ఆయన మండిపడ్డారు. తన కొడుకేమీ డాన్ కాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మీడియా సంస్థల ప్రతినిధులు పనిగట్టుకుని తనపై అసత్య వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కొందరు మీడియా సంస్థల అధిపతులు స్టార్ హోటళ్లలో తప్పతాగి గొడవలకు దిగితే తానే వారిని రక్షించినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.