: అభినవ్ నన్ను చిత్రహింసలు పెట్టేవాడు: టెన్నిస్ ప్లేయర్ భువన
టెన్నిస్ క్రీడాకారిణి భువన-అభినవ్ లవ్ మ్యారేజ్ లో కొత్త ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తమ విషయంలో జోక్యం చేసుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు దాడి చేశాడని అభినవ్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అతని భార్య భువన కీలక వివరణ ఇచ్చింది. అభినవే తనను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించింది. మంత్రి తలసాని కుమారుడు ఈ వివాదంలో చిక్కుకోవడంతో స్వయంగా తలసానే ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. భువనను మీడియా ముందుకు తీసుకొచ్చారు. అభినవ్ పై భువన పలు ఆరోపణలు చేసింది. ‘అభినవ్ నన్ను చిత్ర హింసలు పెట్టేవాడు. నాకు ఎంతో ఇష్టమైన టెన్నిస్ ఆడకుండా చేసేవాడు. నన్ను ఇంట్లో ఉంచి తాళం వేసుకుని ఆఫీసుకు వెళ్లేవాడు. రూ.3 కోట్లు ఇస్తేనే మా నాన్న దగ్గరికి పంపుతాననేవాడు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే అభినవ్ కు పెళ్లయిన విషయం మాకు తర్వాత తెలిసింది. నా కళ్లముందే మా నాన్నను అభినవ్ కొట్టాడు’ అని భువన ఆరోపించింది. ఈ వ్యవహారంపై మంత్రి తలసాని మాట్లాడుతూ, తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని, భువనను అభినవ్ మోసం చేశాడని, అతనికి మొదటిపెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. కాగా, ఇటీవల అభినవ్-భువన ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకోవడం, మంత్రి తలసాని కొడుకు తన భార్యను కిడ్నాప్ చేశాడంటూ అభినవ్ మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాలు తెలిసినవే.